Monday, May 25, 2009

భవబంధాలు

నాగము తన కూసము విడి
సాగెడి కరణిన్ మనుజులు సంగాతులపై
రాగమనెడి హృదయాంతర
భోగము విడి మనుట మేలు భువిలో శాస్త్రీ

పాము తన శరీరరక్షణ కొరకై కుబుసాన్ని ఏర్పరుచుకుంటుంది. కానీ కొన్ని రోజులకు దానిని విదిచిబెట్టి వెళ్ళిపోతుంది. అలాగే మనిషి కూడా తన మనసు వికసించడానికి అనేక బంధాలు ఏర్పరుచుకుంటాడు. ఐతే ఈ బంధాలు కూడా కుబుసం లాగా కడ దాక వచ్చేవి కావు. మధ్యలో వెళ్ళిపోయేవే. ఈ విషయం తెలుసుకున్నవాడు వీటికి దూరంగా ఉండటం మంచిది.

అంటే అర్థం: "అమ్మ ఎవరు, నాన్న ఎవరు? - అన్నీ ఆ పరమాత్ముడే!", అని చెప్పేసి సన్యాసులలోనో, బ్రహ్మచరులలోనూ కలిసిపోమ్మని కాదు. అమ్మ, నాన్న, అన్నా, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, బిడ్డ ఇలాంటి బంధాలు అన్నీ అనుభవిస్తున్నట్టు ఉంటూనే, ఇవి తాత్కాలికం అని తెలుసుకుని తామరాకు పైన నీటి బొట్టుకు మల్లె ఉండటం మంచిది అని.

చాలా రోజులయ్యింది నేను ఈ శతకం కోసం పద్యం వ్రాసి. దైవికంగా ఏవో దైనికి చింతల మధ్యలో పడి, అందరు మనుషుల్లాగే నేనూ మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడంలో విఫలుణ్ణయ్యాను. అందుకే మళ్ళీ మనసు ప్రశాంతతని పొందేదాకా ఆగి వ్రాస్తున్నాను. ఈ దారిలో నన్ను నడిపిస్తున్న ఆ కృష్ణ పరమాత్ముడికి, ఆది శంకరాచార్యునికి నా సాష్టంగప్రణామాలు.

Monday, March 16, 2009

శ్రీహరి నామస్మరణ

దేహీయన నేర్చిన యీ
దేహికి పట్టును తిమిరము దెయ్యము రీతిన్
మోహము బోవగ మార్గము
శ్రీహరిచరణారవింద చింతయె శాస్త్రీ

కోరుకోవడం అనే అలవాటు కలిగిన ఆత్మ అంధకారంలో (మాయాప్రపంచం) పడుతుంది. ఆ కోరికలు ఎప్పటికీ తీరేవి కావు. ఒకవేళ తీరితే మరిన్ని కోరికలకు దారి తీసేవి మాత్రమే. ఆ మాయలోనుండి బయట పడేందుకు మార్గం భగవద్-ధ్యానమే. భక్తియోగాన్న్ని అవలంబిస్తే ఏనాటికైనా ఆ పరమాత్ముడిని చేరుతాము.

Sunday, July 6, 2008

కాదనలేక కల్యాణం...కలకాలం కాంతాళం...

చెల్లని నుడి పొగడదగును
మొల్లము త్యజియించదగును మొగమోటమితో
ఉల్లమునొప్పక నెరవుగ
ఒల్లకుమీ పెళ్లి మాట ముప్పుర శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
నుడి = మాట, ప్రమాణం
మొల్లము = ధనము
త్యజియించు = విడిచిపెట్టు
మొగమోటమి =
(వాడుక లో) మొహమాటం
ఉల్లము = మనసు
నెరవుగ = పూర్తిగా
ఒల్లు = ఎంచుకొను, ఒప్పుకొను

భావము:
--
మొహమాటంతో పచ్చి అబద్ధాన్ని (నిజమని) పొగడవచ్చు, డబ్బుని విడిచిపెట్టవచ్చు. అంతే కానీ,
(మొహమాటంతో) మనసుకు నచ్చకుండా మనువాడరాదు. అది ముప్పుకు దారి తీస్తుంది.

ఎవరైనా "నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అంటే - మొహమాటానికో, వారి మెప్పు పొందటానికో, వేరొక కారణం చేతనో పెళ్ళి చేసుకోకూడదు. నిజంగా మనసుకు నచ్చితేనే చేసుకోవాలి. అలాగని, "నాకెవరూ నచ్చలేదు అని కూర్చోవచ్చా?", అంటే అది మీ ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. ఎవ్వరూ నచ్చకపోతే మనమే ఎక్కువగా ఆశిస్తున్నామేమో!

Wednesday, December 26, 2007

ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం

ఏకతమాడుచు తెల్పుము
ఆకూతంబులనగూఢభావముదోడన్
ఏకీభావంబువినా
చీకటిలో వెదకులాట చెలిమియె శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
ఏకతమాడు = ఏకాంతంలో మాట్లాడు (తగిన సందర్భంలో)
ఆకూతము = అభిప్రాయము, కోరిక
అగూఢభావము = దాపరికము లేకుండా
ఏకీభావము = ఐక్యత, ఏకాభిప్రాయము
వినా = లేకుండా

భావము:
--
ఏదైనా బంధానికి ఇరువర్గాలూ వారి అభిప్రాయాలను తేటపరచాలి. లేనిచో ఆ బంధం - ముసుకులో గుద్దులాటలాగా ఉంటుంది. నిజమైన చెలిమి సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగిస్తే, ఇలాంటి (పరస్పరం అవగాహన లేని) చెలిమివలన బాధ, అశాంతి కలుగుతూ ఉంటాయి.

అలాగని, అభిప్రాయాల్ని ఎక్కడబడితే అక్కడ తెలుపరాదు. సరియైన సందర్భం, చోటూ చూసుకుని చర్చించుకోవాలి.

Thursday, December 20, 2007

అంగములను అధిగమించుట అవఘళము

దబ్బర తెలియని వెకలియు
బిబ్బోకములెరుగలేని పేడియు పుణ్యుల్
ప్రెబ్బొత్తిగ వీరు నయము
కిబ్బిషములు జేయలేరు కెలవున శాస్త్రీ

కొన్ని పదములక అర్థములు:
--
దబ్బర = మోసము, అబద్ధము
వెకలి = పిచ్చివాడు, వెర్రివాడు
బిబోకము = శృంగార చేష్ట
ఎరగు = గ్రహించు
పేడి = నపుంసకుడు (ఆడ, మగ కాని మనిషి)
పుణ్యుడు = పవిత్రమైనవాడు
ప్రెబ్బొత్తిగ = నిశ్చయముగ
నయము = ఉన్నతము
కిబ్బిషము = పాపము
కెలవు = సంభోగేచ్ఛ

భావము:
--
పిచ్చివాళ్ళు, నపుంసకులు కామోద్రేకంతో, స్వార్థంతో తప్పిదములు, అధర్మములు చేసేవారి కంటే అదృష్టవంతులు. వారికి తప్పు చేసే అవకాశం ఉందని గాని, దాని వలన వారికి కలిగే తాత్కాలికమైన లాభముల గురించిగాని తెలియదు.

Sunday, December 9, 2007

పుట్టిన రోజున పుట్టెడు పుణ్యం చేయాలి

పట్టెడు కూడనువారికి
పెట్టక బలిసిన హితులకు విందనియనుచున్
వట్టిగ కాసులు విసురుచు
పుట్టినరోజని మురియుట మూఢము శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
పట్టెడు = అరచేతినిండుగ
కూడు = అన్నం, తిండి
వట్టిగ = వృథాగ
కాసులు = ధనము
మూఢము = అఙానము

భావము:
--

పుట్టినరోజు పూట ఆకలితో ఉన్న నలుగురు పేదలకు అన్నం పెట్టకుండా - తెగబలిసిన బంధువులకూ, మిత్రులకూ డబ్బు వెదజల్లి విందులు అందించడం, అది చూసి మురిసిపోవటం - కేవలం అఙానం.

ఐతే నా వాదన: "అయినవారి మీద అభిమానం చూపవద్దు", అని కాదు. "లేనివారికి ఉన్న అవసరాన్ని గుర్తించి, మానవత్వం చూపి, మనిషిగా పుట్టిన రోజును గుర్తు చేసుకోవాలి", అని నా ఉద్దేశం.

ఈ రోజు, తిథుల ప్రకారం నా పుట్టినరోజు! అందుకే సందర్భోచితంగా...

Saturday, December 8, 2007

ఒక వయసు తరువాత డబ్బు విషయాలు విడిచిపెట్టాలి

ధనమున సురలను మించిన
తనయులు శ్రీమంతులయిన తనియక యటుపై
మనుమలు మనువాడుదాక
మనమున హరి కానరాడు మనిషికి శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
సురలు = దేవతలు (క్షీరసాగరం మథించిన తరువాత సిరులను పొందిన వారు)
తనియు = తృప్తి చెందు
మనువాడు = పెండ్లి చేసుకొను
హరి = నారాయణుడు (పరమాత్ముడు)

భావము:
--
నూటికి తొంభై శాతం మంది - కాళ్ళూ చేతులూ ఆడినంత కాలం డబ్బు సంపాదించడం మీదనే ధ్యాస నిలుపుతారు (ఎంత సంపాదించినా). నామమాత్రంగా పరమాత్ముణ్ణి ధ్యానించినా వారి మనసులో డబ్బు ఊసు మెదులుతూనే ఉంటుంది.

ఇలా జీవితమంతా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటూనే ఊండి, ఇక రేపో మాపో అనగా, ఉన్నట్టుండి నారాయణమంత్రం జపిస్తారు. మరి వారిద్దరూ ఒకే చోట ఉండి, అన్నీ చూస్తూ, ఏమనుకుంటారో!